ఓం చింతామణి గృహాంతస్థాయై నమః
అమ్మవారు చింతామణి గృహమునందు ఉండునది. స్థ అంటే ఉండునది అని అర్థము. పుంలింగం లో అయితే గృహస్థః అంటాము, అదే స్త్రీ లింగం లో అయితే గృహస్థా అంటాము. గృహస్థా అంటే గృహములో ఉండునది, ఏ గృహములో ఉంటుంది అంటే చింతామణి గృహం. అమ్మవారు చింతామణి అని పేరు కలిగిన ఒక అద్భుతమైన గృహము నందు ఉండునది. చింతామణి గృహము అంటే అంతరార్థము ఏమిటంటే మణులలో చింతామణి అని కొన్ని మణులు ఉన్నాయి, ఈ మణులతో తాపడం చేయబడిన గృహములో ఉంటుంది అమ్మవారు.
పూర్వము దేవదానవులు పాలసముద్రమును చిలికితే అందులో నుంచి ఒక చింతామణి పుట్టింది, ఈ మణికి నమస్కారము చేసి చేతిలో పట్టుకొని ఏ వస్తువు అడిగితే అది ఇస్తుంది. చింతించుట అంటే కోరుకొనుట, ఆలోచించుట. ఆలోచించీ ఆలోచించగానే, కోరీ కోరగానే ఏ వస్తువు అడిగితే దానిని ఇస్తోంది కనుక చింతామణి అన్నారు.
కోరిన కోరికలను అయ్యో ఇంత ఎక్కువ కోరుతున్నాడు లేదా తక్కువ కోరుతున్నాడు అని ఆలోచించకుండా కోరిక కోరగానే ఆ కోరికలను తీరుస్తోంది కనుక (అది కూడా పవిత్రమైన కోరికలను మళ్లీ అపవిత్రమైన లోక నాశనకరమైన కోరికలు కోరుకోకూడదు) ఆ మణిని చింతామణి అన్నారు.
పాలసముద్రము నుంచి పుట్టిన ఒక్క చింతామణి దేవతల దగ్గర ఉంటేనే, దేవతల కోరికలు తీరిపోతాయి. అలాంటిది అమ్మవారు ఇల్లునంతా చింతామణులతో నిర్మించుకున్నది, అనగా అమ్మ వారి కంటే గొప్పగా కోరికలు తీర్చే వారు మరొకరు లేరు.
అమ్మవారు ఎన్ని చింతామణులను సృష్టించి ఉంటుందో, అన్ని రకములైన చింతామణులతో తాపడం చేయబడిన, చింతామణి ఖచితమైన గృహములో అమ్మవారు ఉంటున్నది.
అమ్మవారు చింతామణులను సృష్టించింది కనుక అమ్మవారు ఉండేది చింతామణుల మధ్యలో కనుక అమ్మవారి గురించి ఆలోచించగానే కోరికలు తీరకుండా ఎలా ఉంటాయి.
మంత్ర ప్రయోగము ౼ ఫలితము:
సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరుకున్న వాళ్లు శనివారము, ఆదివారము, సోమవారము ఈ మూడు రోజులు విడిచిపెట్టకుండా ఆరు నెలల పాటు ఈ మూడు రోజులు ప్రతిరోజూ 1008 చొప్పున ఈ మంత్ర జపము చెయ్యండి, తులసీ దళములతో అమ్మవారిని పూజిస్తూ అర్చన చేయండి.
ప్రతి వారములోనూ వచ్చే శనివారము, ఆదివారము, సోమవారాలలో ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అనే మంత్ర జపం చేస్తూ అమ్మను తులసీ దళములతో పూజ చేయండి.
కొంతమందికి దౌర్భాగ్య జాతకాలు ఉంటాయి, వాళ్ళు యావజ్జీవితం కష్టపడినా స్వగృహ ప్రాప్తి ఉండదు. అలాంటి వాళ్లకు కూడా స్వగృహ ప్రాప్తిని కలిగించే మహా మంత్రము ఇది.
సూచన:
గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని లేనివారు ఓంకారం లేకుండా జపం చేసుకోవచ్చు.
https://srivaddipartipadmakar.org
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.